అండర్‌‌ ట్రయల్‌‌ ఖైదీల్లో మార్పు రావాలి

  •  క్షణికావేశంలో చేసిన తప్పులకు కుటుంబాలు బలవుతున్నాయి
  • మైనార్టీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోంది
  • మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి

కోదాడ/హుజూర్‌‌నగర్‌‌, వెలుగు : అండర్‌‌ ట్రయల్‌‌ ఖైదీల్లో మానసిక పరివర్తన రావాలని మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి ఆకాంక్షించారు. క్షణికావేశంలో చేసిన తప్పుల కారణంగా కుటుంబాలు బలి అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని బుధవారం హుజూర్‌‌నగర్‌‌లోని జైల్‌‌ను మంత్రి సందర్శించి, అండర్‌‌ ట్రయిల్‌‌ ఖైదీలతో కలిసి అక్కడే బ్రేక్‌‌ఫాస్ట్‌‌ చేశారు.

అనంతరం ఖైదీలతో మాట్లాడి వారు జైలుకు వచ్చిన పరిస్థితుల గురించి అడిగి తెలుసుకున్నారు. చిన్నచిన్న తప్పుల కారణంగా కుటుంబాలకు దూరమై ఒంటరి జీవితం గడిపే సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సూచించారు. తాము అనుభవించిన, అనుభవిస్తున్న దుర్భర పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించాలని, దీని వల్ల సమాజంలో మార్పు తీసుకురావొచ్చని అభిప్రాయపడ్డారు.

మైనార్టీల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నాం

మైనార్టీల అభ్యున్నతికి కాంగ్రెస్‌‌ కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి చెప్పారు. మైనార్టీ బాలికల సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్నామన్నారు. కోదాడ ఎమ్మెల్యే పద్మావతి, టూరిజం డెవలప్‌‌మెంట్‌‌ కార్పొరేషన్‌‌ చైర్మన్‌‌ పటేల్‌‌ రమేశ్‌‌రెడ్డితో కలిసి బుధవారం కోదాడ మైనార్టీ రెసిడెన్షియల్‌‌ స్కూల్‌‌, కాలేజీని సందర్శించి, స్టూడెంట్లతో కలిసి సహపంక్తి భోజనం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పోటీ పరీక్షల కోసం అవసరమైన పుస్తకాలతో పాటు సురక్షిత తాగునీటికి ఆర్‌‌వో ప్లాంట్‌‌ ఏర్పాటు చేస్తామని, డిజిటల్‌‌ తరగతులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. చదువు వల్లే ప్రతి ఒక్కరికీ గుర్తింపు వస్తుందని, అందువల్లే తమ ప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్ల నుంచి రూ. -300 కోట్లతో అంతర్జాతీయ స్థాయిలో యంగ్‌‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నామని, స్కిల్‌‌ యూనివర్సిటీతో పాటు స్పోర్ట్స్‌‌ యూనివర్సిటీని సైతం ఏర్పాటు చేస్తున్నామన్నారు.

తెలంగాణ అక్షరాస్యత రేటు 100 శాతానికి చేరేలా నిరంతరం కృషి చేస్తున్నామన్నారు. స్టూడెంట్లతో కలిసి కొత్త సంవత్సర వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్టూడెంట్లకు నాణ్యమైన విద్య అందించి, ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కలెక్టర్‌‌ తేజస్‌‌ నంద్‌‌లాల్‌‌ పవార్‌‌, ఎస్పీ సన్‌‌ప్రీత్‌‌సింగ్‌‌, ఆర్డీవో సూర్యనారాయణ, జిల్లా మైనార్టీ అధికారి జగదీశ్వర్‌‌రెడ్డి, పీసీసీ సెక్రటరీ చింతకుంట్ల లక్ష్మీనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌ వంగవీటి రామారావు, మార్కెట్ కమిటీ వైస్‌‌ చైర్మన్‌‌ బషీర్, తహసీల్దార్‌‌ వాజీద్‌‌ అలీ, ఎంఈవో సలీం షరీప్, ప్రిన్సిపల్‌‌ మాధురీశర్మ, ఆర్‌‌ఐ రాజేశ్‌‌ పాల్గొన్నారు.